ప్రజా ప్రతినిధులు మరియు అధికారులందరి సమన్వయం, సహకారంతో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 6 నుండి 31 వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు) మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఒకరోజు ఆరు రకాల ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
దీనికోసం నిపుణులైన డాక్టర్లను నియమించి డెంటల్, ఓబీజీ, ఆర్థో, ఆఫ్తమాలజీ, పీడియాట్రిక్ విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు, తదుపరి వైద్య సేవలు కూడా అందిస్తున్నట్లు చెప్పారు.
రోగులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రత్యేక ఐడి నెంబర్ ఇవ్వబడుతుందని, ఆ ఐడి ఆధారంగా భవిష్యత్తులో కూడా వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు. స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రతిరోజూ రెండు నుండి మూడు పీహెచ్‌సీలను కవర్ చేస్తూ జిల్లాలోని అన్ని కేంద్రాలకు సేవలు అందించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నుండి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల పరిష్కారాన్ని కూడా వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారంతో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లైన్ వాడ యూపీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన ఆఫ్తమాలజీ, ఆర్థో, డెంటల్ కౌంటర్లతో పాటు రిజిస్ట్రేషన్ కౌంటర్‌ను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వారి సమస్యలను విని వెంటనే పరిష్కరించాలని డాక్టర్లను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. నేత నరసింహారావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా. కళ్యాణ్ చక్రవర్తి, లైన్ వాడ యూపీహెచ్‌సి డా. ఇఫ్టేయార్, కార్పొరేటర్ మహమ్మద్ ఖాజా సమయుద్దిన్ నదీమ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments