తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 24:
రాజ్యాంగంలో పొందుపరిచిన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే పత్రికా స్వేచ్ఛ ఉందని, జర్నలిస్టులు ఈ అంశాన్ని లోతుగా గ్రహించి పత్రికా చట్టాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నల్లగొండ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నిర్వహించిన శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ‘ఫోర్త్ ఎస్టేట్’గా గుర్తింపు పొందిన విలేకరులకు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
మీడియా రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టాలు, జర్నలిస్టుల బాధ్యతలు, రక్షణ చర్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో ఏఐ, చాట్ జీపీటీ వంటి ఆధునిక సాధనాలపై జర్నలిస్టులు అవగాహన పెంచుకుని జర్నలిజం నాణ్యతను మెరుగుపర్చాలని సూచించారు. వాస్తవాలను పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను ప్రచురించాలి లేదా ప్రసారం చేయాలని అన్నారు. అప్పుడే జర్నలిజం వృత్తి గౌరవం, విశ్వసనీయత మరింత పెరుగుతాయన్నారు.
శిక్షణా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు “తెలంగాణ జర్నలిజం – గతం, వర్తమానం, భవిష్యత్తు, మీడియా దోరణులు” అంశంపై ప్రముఖ సంపాదకులు కే. శ్రీనివాస్, “భాష – తప్పులు, ఒప్పులు” అంశంపై వెలుగు దినపత్రిక నెట్‌వర్క్ ఇన్‌చార్జి చిల్ల మల్లేషం, “వార్తా కథనాలు, ప్రత్యేక కథనాలు” అంశంపై దిశ దినపత్రిక ఎడిటర్ మార్కండేయ జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. “నైతిక నియమాలు, మీడియా చట్టాలు” అంశంపై తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి శిక్షణ ఇచ్చారు.
కార్యక్రమం అనంతరం శిక్షణలో పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ తరఫున సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, నల్లగొండ జిల్లా జర్నలిస్టు నాయకులు కంది సూర్యనారాయణ, అబ్బోజు మదనాచారి, పిట్టల రామకృష్ణ, కాకునూరి జగదీశ్వరచారి, వెన్నమల్ల రమేష్ బాబు, గొర్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments