జనవరి 20, 2026 | చీకటి–వెలుగు – నల్లగొండ
నల్లగొండ కార్పొరేషన్ మేయర్ పదవి ప్రతిష్టాత్మకంగా మారింది. తొలిసారిగా మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ కావడంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది.
రంగంలోకి ఇద్దరు నేతల భార్యలు
మేయర్, కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం పోటీ మరింత ఉత్కంఠకు దారితీస్తోంది. ఇద్దరు సీనియర్ నేతల భార్యలు కార్పొరేటర్లుగా పోటీకి సిద్ధమవడం రాజకీయ వేడి పెంచుతోంది. అయితే, మేయర్ అభ్యర్థి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోవడం పార్టీ వర్గాల్లో అయోమయం సృష్టిస్తోంది.
కోమటిరెడ్డి ఎపిసోడ్ తర్వాత కోల్డ్ వార్
జిల్లా మంత్రి కోమటిరెడ్డి అంశంపై రాష్ట్రంలో రాజకీయ వేడి తగ్గకముందే, నల్లగొండలో మేయర్ పదవి కోసం సీనియర్ నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. 2014లో మహిళలకు మున్సిపల్ చైర్మన్ పదవి రిజర్వ్ అయినప్పుడు కూడా ఇదే ఇద్దరి మధ్య తీవ్ర పోటీ జరిగింది. అప్పట్లో మోహన్ రెడ్డి భార్య సుజాత అభ్యర్థిగా ప్రకటించబడినా, ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఏకపక్ష నిర్ణయంపై అసంతృప్తి
మేయర్ పదవికి ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా, బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్య రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం నల్లగొండకు వచ్చిన మంత్రి ఈ దిశగా సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై గుమ్మల మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినా కీలక పదవులు దక్కలేదని, చర్చ లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని మోహన్ రెడ్డి వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నార్థకం
మోహన్ రెడ్డి గతంలో ఎంపీ, ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్ చైర్మన్ వంటి పదవుల కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదని సమాచారం. ఇప్పుడు మేయర్ పదవి కీలక అవకాశంగా మారిందని, ఇది కూడా చేజారితే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ లోపలి చర్చ.
కార్పొరేటర్ పోటీ ఖాయం
చైతన్య రెడ్డితో పాటు సుజాత కూడా కార్పొరేటర్‌గా పోటీ చేయడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. 13వ వార్డు (జనరల్ మహిళలు)గా రిజర్వ్ అయిన ఈ వార్డులో విద్యుత్‌నగర్, గిరకబావిగూడెం ప్రాంతాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్ రెడ్డి, 11 వార్డుల్లో పార్టీని బలోపేతం చేసినట్లు సమాచారం.
రెండు రోజులుగా ఎడతెరిపిలేని చర్చలు
గత రెండు రోజులుగా పార్టీ క్యాంప్ కార్యాలయంలో నిరంతర సమావేశాలు జరుగుతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ పదవిపై స్పష్టమైన హామీ లభించకపోతే మేయర్ పదవిపై స్పష్టత రాదని సమాచారం. అలాగే 48 వార్డుల్లో 8 వార్డుల్లో అభ్యర్థుల మార్పు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్లు ఖరారు కాలేదని, ప్రతి వార్డుకు ముగ్గురు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి సర్వే, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే కాంగ్రెస్‌కు గట్టి సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
— చీకటి–వెలుగు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments