నల్గొండ జిల్లా:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా చేపట్టిన “సురక్షితంగా చేరుకుందాం – రోడ్డు భద్రత ప్రచార కార్యక్రమం–2026”లో భాగంగా నల్గొండ జిల్లాలో ఆర్‌టీసీ, ఆటో డ్రైవర్లకు విస్తృత రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ జి. రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో డ్రైవర్లకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరగడానికి ప్రధాన కారణం మానవ తప్పిదాలేనని తెలిపారు. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం వల్ల అనేక కుటుంబాలు తమ ఆత్మీయులను అకాలంలో కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్‌టీసీ, ఆటో డ్రైవర్లు రోజూ వందలాది మంది ప్రయాణికుల ప్రాణ భద్రత బాధ్యత వహిస్తున్నారని, అందువల్ల వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం పూర్తిగా నిషేధమని, వేగ పరిమితులు, ట్రాఫిక్ సంకేతాలు, రోడ్డు సూచిక బోర్డులను తప్పనిసరిగా పాటిస్తూ వాహనాలు నడపాలని స్పష్టం చేశారు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించకూడదని, ప్రయాణికులను సురక్షితంగా ఎక్కించి దించాలని తెలిపారు.
వాహనాల సాంకేతిక పరిస్థితి—బ్రేకులు, లైట్లు తదితరాలను తరచూ తనిఖీ చేయాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి, బాధితులకు ప్రాథమిక సహాయం ఎలా అందించాలనే అంశాలపై కూడా డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ వరకు రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా, రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు, డ్రైవర్లు, సాధారణ ప్రజల కోసం అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.
సదస్సు ముగింపులో “సురక్షితంగా చేరుకుందాం” రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఆర్‌టీసీ, ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని, ప్రయాణికుల ప్రాణ భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తామని, ప్రమాద రహిత ప్రయాణానికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వాణి, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ ఎస్‌ఐ సైదులు, ఆర్‌టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ రాంరెడ్డి, డీఎం వెంకటరమణ, డీటీఆర్బీ రిటైర్డ్ సీఐ అంజయ్య, ఆర్‌టీసీ అధికారులు, రవాణా శాఖ సిబ్బంది, ఆర్‌టీసీ మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments