జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాలు
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా జిల్లాలోని హోటళ్లు, దాబాలు, తినుబండారాల కేంద్రాలు, ఆహార ఉత్పత్తి యూనిట్లపై ఆహార భద్రత అధికారులు విస్తృత తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.
శుక్రవారం తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల నుంచి ఆహార నమూనాలు తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. కాంట్రాక్టు కేటరింగ్ నిర్వహిస్తున్న ప్రతి సంస్థ నుంచి ప్రతినెల కనీసం ఒకసారి శాంపిల్స్ తీసుకుని ఆహార నాణ్యత, పోషక విలువలను పరిశీలించాలని అన్నారు.
కల్తీ ఆహారం విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని, ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆహార భద్రత అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలోని అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు జారీ చేయాలని, మే నెలాఖరు నాటికి అన్ని సంస్థలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియలో భాగంగా ఎంఈఓలు కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లతో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు, శిక్షణ కల్పించాలని, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ రహదారి–65పై ఉన్న హోటళ్లు, దాబాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని చెప్పారు.
ఇదివరకు కేసులు నమోదు చేసిన వారికీ నోటీసులు జారీ చేయాలని, పాఠశాలల్లో ఆహార నిల్వ, భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కల్తీ ఆహారంపై ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సహా అన్ని ఏరియా ఆసుపత్రుల్లో సంబంధిత సూపరింటెండెంట్లతో నెలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, జిల్లా జైలుకు కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు జారీ చేయాలని తెలిపారు.
సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారి–65పై ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అధికారులు, జిల్లా స్థాయి శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments