– జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళా విద్య అభివృద్ధికి నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

సావిత్రిబాయి పూలే 159వ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోనే భారత రాజ్యాంగంలో విద్యా హక్కు చట్టం, సమానత్వానికి సంబంధించిన చట్టాలు పొందుపరచడం జరిగిందని అన్నారు. మహిళా విద్య కోసం ఆమె చేసిన కృషిని గుర్తించి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.
ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసిందని, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా బాలికలు, మహిళల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. బాలికలు మధ్యలోనే చదువు మానకుండా చూడటం, మహిళా అక్షరాస్యత పెంపు కోసం ‘ఉల్లాస్’ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన మహిళలు చదువు నేర్చుకునేలా ప్రోత్సహించడం జరుగుతుందని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
బ్రిటిష్ పాలన కాలంలో సమాజంలో ఉన్న సతీ సహగమనం, బాల్య వివాహాల వంటి సామాజిక దుష్ప్రవర్తనలను వ్యతిరేకిస్తూ జ్యోతిబా పూలే చేపట్టిన ఉద్యమంలో సావిత్రిబాయి పూలే కీలక పాత్ర పోషించారని చెప్పారు. మహిళా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక కార్యకర్తగా సేవలందించారని పేర్కొన్నారు. జ్యోతిబా పూలే స్థాపించిన ‘సత్యశోధన’ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మహిళా విద్య, సామాజిక సంస్కరణలపై అవగాహన కల్పించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే మహిళా విద్య కోసం చేసిన సేవలు సమాజానికి ఆదర్శమని అన్నారు. మహిళకు విద్య ఉన్నప్పుడే సామాజిక సమస్యలు తొలగిపోతాయని, సమాజాన్ని ఎదిరించి మహిళల కోసం విద్యాలయాలు ఏర్పాటు చేసి ఆమె చేసిన కృషిని కొనియాడారు.
విశ్రాంత ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, మిర్యాల యాదగిరి, వెంకటేశ్వర్లు, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పరమేష్, పలువురు ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments