ద్వేషపూరిత నేరాలపై అసెంబ్లీలో బిల్లు ఆమోదించాలి – జమియత్ ఉలేమా డిమాండ్**
నల్గొండ, తెలంగాణ:
కర్ణాటక రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా ద్వేషపూరిత నేరాలు, ద్వేష ప్రసంగాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని వెంటనే తీసుకురావాలని జమియత్ ఉలేమా తెలంగాణ అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సానుద్దీన్ ఖాస్మీ డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జమియత్ ఉలేమా ప్రతినిధుల సూచనల మేరకు చేర్చిన హామీని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడడంలో, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీడియా పాత్ర కీలకమని పేర్కొంటూ, బాధ్యతాయుతంగా పనిచేస్తున్న పాత్రికేయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
భారతదేశం ప్రస్తుతం అసహనం, అసహ్యత పెరుగుతున్న పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేసిన మౌలానా ఎహ్సానుద్దీన్ ఖాస్మీ, రాష్ట్రం మరియు కేంద్ర స్థాయిలోని కొందరు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులే రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. సాధారణ పౌరుల స్వేచ్ఛలు, మౌలిక హక్కులు క్రమంగా హరించబడుతున్నాయని అన్నారు.
జమియత్ ఉలేమా రాజకీయ పార్టీలకు సమర్పించిన డిమాండ్లలో అత్యంత కీలకమైనది ద్వేష ప్రసంగాలు, ద్వేష ఆధారిత నేరాలను అరికట్టే చట్టమని ఆయన తెలిపారు. ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ అంగీకరించి తన మేనిఫెస్టోలో చేర్చిందని గుర్తు చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కూడా భేటీ జరిగిందని వెల్లడించారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఆదర్శంగా తీసుకుని, రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయడానికి త్వరలోనే జమియత్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని రూపొందించే లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు.
దేశంలో పెరుగుతున్న అసహనం, ముస్లింలపై జరుగుతున్న వివక్ష, మైనారిటీలను ప్రధాన స్రవంతి నుంచి దూరం చేసే ప్రయత్నాలు, ముస్లింలలో పెరుగుతున్న భయం, అభద్రతా భావం నేపథ్యంలో జమియత్ ఉలేమా ఎ హింద్ అధ్యక్షుడు హజ్రత్ మౌలానా సయ్యద్ మహమూద్ అసద్ మదానీ “మైనారిటీల న్యాయం – సాధికారత” విభాగాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. పక్షపాతం, ద్వేషం ఆధారంగా జరిగే నేరాలను నివారించడమే ఈ విభాగం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ప్రసంగాలపై మరియు వాటికి పాల్పడే వ్యక్తులపై చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, ఆ ప్రకటనకు వెంటనే చట్టపరమైన రూపం ఇవ్వాలని మౌలానా ఎహ్సానుద్దీన్ ఖాస్మీ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎం ఏ హఫీజ్ ఖాన్, జిల్లా జనరల్ సెక్రటరీ మౌలానా అక్బర్ ఖాన్ అసాది, జాయింట్ సెక్రటరీ సయ్యద్ ఫుర్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ రెహమాన్ ఖాన్, మౌలానా జుబేర్ మజాహిరి, మౌలానా ఉబేద్, మౌలానా ఖాజా జియావుద్దీన్, మౌలానా యాసర్, మౌలానా అబ్దుల్ సమీ, ముఖ్తి సోహెబ్, ఆఫీస్ శంషుద్దీన్, హఫీజ్ అతీక్, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments