నల్లగొండ యాదవ భవన్ అమర వీరుల ప్రాంగణంలో అఖిల భారత రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర జనరల్ సమావేశం మేక రాంరెడ్డి, సనప పొమ్మయ్య, కోడి సోమయ్య అధ్యక్షతన నిర్వహించారు.
సమావేశానికి ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం జెండాను మేక రాంరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రైతాంగ హక్కుల కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు.
సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ప్రముఖ న్యాయవాది కట్టా భగవంత్ రెడ్డి మాట్లాడుతూ—
భారత్ ఒక వ్యవసాయ దేశమని, 70%కు పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోడి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
ఈ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా రైతులు 13 నెలలకు పైగా ఆందోళన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సమయంలో 700 మందికి పైగా రైతులు మరణించారని, ఆ ప్రజా పోరాటం వల్లే కేంద్రం చివరికి చట్టాలను వెనక్కి తీసుకుందని తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు-ప్రజావ్యతిరేక విధానాలను ఎదిరిస్తూ ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
భహుజన రైతు-కూలీ సంఘం నాయకుడు K. పర్వతాలు మాట్లాడుతూ రైతులు, కూలీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిపై ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
CPI (ML) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు K. అనంత రెడ్డి మాట్లాడుతూ—
దేశంలో అసమానతలు పెరుగుతున్నాయని, ఉద్యమాలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల నిర్భందాలు ప్రయోగిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్య భారతంలో ఆపరేషన్ “కాగార్” పేరుతో ఆదివాసీలు, విప్లవ కారులపై దారుణ ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాలు లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యమని అన్నారు.
అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరచి ప్రజలను మోసం చేసిందని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాలు కొనసాగాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు బానోత్ ఊక్లా, పోలూరి శ్రీనివాసరావు, బండపల్లి వెంకటేశ్వర్లు, M. అంజయ్య తదితరులు ప్రసంగించారు.
కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు దొంతమల్ల రాములు, రామచంద్రు, భాస్కర్ రెడ్డి, గడ్డం నర్సింహ, వల్లూరి మల్లేష్, K. వెంకట్, బాణాల వెంకట్ రెడ్డి, M. దాస్, కవిత, బుజ్జయ్య, సురేష్, షేరు మధు, యాకయ్య, గణేష్, వెంకన్న, పాపారావు, శివ, నాగన్న, కోటక్క, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments