అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన పెంపొందించుకొని చట్టాలను వినియోగించుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, లింగ సమానత్వం వంటి అంశాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి ఈ. హరిత మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళల కృషి, ప్రతిభ, ధైర్యం మరియు నాయకత్వాన్ని గుర్తుచేసుకునే రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవమని తెలిపారు. మహిళలకు అవకాశాలు, గౌరవం, విద్య లభించినప్పుడే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పుణ్య శైలజ మాట్లాడుతూ మహిళలకు రాజకీయ రంగంలో 33 శాతం రిజర్వేషన్‌తో పాటు అన్ని రంగాల్లో ముందుకు నడిపించాల్సిన బాధ్యత సమాజానిదని అన్నారు. నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చనగోని రజిత మాట్లాడుతూ మహిళలు శక్తివంతంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజం మరియు దేశం బలంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు మాదిరెడ్డి సంధ్య, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments