డాక్టర్ సహా ఏడుగురు అరెస్ట్ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరిక
నల్లగొండలో జరిగిన అక్రమ దత్తత వ్యవహారంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రెండు వేర్వేరు కేసుల్లో పది రోజుల పాపను, 21 రోజుల బాబును అక్రమంగా దత్తత ఇచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుల్లో మొత్తం ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఈ అమానవీయ ఘటనను తీవ్రంగా తీసుకొని, డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు ఆధ్వర్యంలో జరిగిన వేగవంతమైన విచారణలో డాక్టర్, మధ్యవర్తులు, దత్తత తీసుకున్న కుటుంబాలు బట్టబయలయ్యాయి.
పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ.20,000 నగదు, ఏడు సెల్‌ఫోన్లు, దత్తత ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు శిశువులను సురక్షితంగా శిశు గృహానికి తరలించారు.
📌 మొదటి కేసు వివరాలు:
నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో ఎల్లాపురానికి చెందిన కుర్ర బాబు, హాలియాలోని డాక్టర్ శాంతి ప్రియ, ఏలూరుకు చెందిన సాంబమూర్తి-రజిత దంపతులు పాల్గొన్నారు. పుట్టిన ఆడపాపను ₹2.30 లక్షలకు దత్తత ఇచ్చినట్లు విచారణలో తేలింది.
📌 రెండవ కేసు వివరాలు:
గుర్రంపోడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన ఒర్సు శ్రీను – మమత దంపతులు పుట్టిన మగబిడ్డను ₹4.5 లక్షలకు అమ్మినట్లు బయటపడింది. బోయినపల్లి గ్రామానికి చెందిన వేముల నాగరాజు, సువర్ణ దంపతులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.
ఈ రెండు కేసుల్లో డాక్టర్ శాంతి ప్రియ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరచి జ్యుడీషియల్ రిమాండ్‌కి పంపించారు.
🚨 ఎస్పీ హెచ్చరిక:
“మైనర్ పిల్లలను అమ్మడం, కొనడం, దత్తత తీసుకోవడం లేదా మధ్యవర్తిత్వం చేయడం చట్టవ్యతిరేకం మరియు తీవ్ర నేరం,” అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు.
ఏ గ్రామంలో, తండాలో లేదా పట్టణంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే వెంటనే పోలీసులకు లేదా ICDS అధికారులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
ఈ కేసులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు రాజశేఖర్ రెడ్డి, రాఘవరావు, డబ్ల్యూఓ కృష్ణవేణి, డీసీపీవో గణేష్, మరియు సంబంధిత సిబ్బందిని ఎస్పీ పవార్ అభినందించారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments