సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంతకల్లు జగదీశ్ రెడ్డి శనివారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి నల్లగొండ సమీపంలోని అబ్జాలబావి పీఎస్పీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, బాధలో ఉన్న రైతులను పరామర్శించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ జగదీశ్ రెడ్డి అన్నారు –
“జిల్లాలో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. పంటలు నష్టపోయి రైతులు కన్నీళ్లలో మునిగిపోతున్నారు. ప్రభుత్వం చేతకాని తనం ఒక వైపు, ప్రకృతి ప్రళయం మరో వైపు అన్నదాతలు దెబ్బతింటున్నారు. మంత్రులు మాత్రం కమిషన్లు, విదేశీ టూర్లు, సంపద సంపాదనలతోనే బిజీగా ఉన్నారు,” అని విమర్శించారు.
మాజీ మంత్రి తెలిపారు –
“రైస్ మిల్లర్ల వద్ద కోట్ల రూపాయల లంచాలు తీసుకుని మంత్రులు వారికే వంగి వంగి నమస్కరిస్తున్నారు. ఫలితంగా మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు. ఎక్కడ చూసినా మొలకలు వచ్చిన ధాన్యం కనిపిస్తోంది. పత్తి రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం, పత్తి మొత్తంగా కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు రైతులను ఎడిపిస్తున్న ప్రభుత్వం వచ్చింది,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే,
“యూరియా కొరతతో రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు ధాన్యం కొనక మరింత బాధ కలిగిస్తోంది. తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా కొనాలి. లేకుంటే పార్టీ తరఫున తీవ్ర ఉద్యమం చేపడతాం,” అని హెచ్చరించారు.
రైతులకు పిలుపునిస్తూ ఆయన అన్నారు –
“రైతులు ఇక మౌనంగా ఉండకూడదు. మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడ కనిపించినా నిలదీయాలి. తిరుగుబాటు చేస్తేనే న్యాయం సాధ్యమవుతుంది,” అని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్ట మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ జెడ్పీటీసీలు తండు సైదులు గౌడ్, తుమ్మల లింగస్వామి, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాసరెడ్డి, మారగొని గణేష్, పెరిక యాదయ్య, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments