నల్లగొండ, నవంబర్ 4:
విద్యార్థులు చదువుతో పాటు వృత్తి విద్యలోనూ నైపుణ్యాలు సంపాదించుకోవడం, సృజనాత్మకత పెంపొందించుకోవడం అవసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలు, 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులకు వృత్తి విద్య (Vocational Training) పై అవగాహన కల్పించి, అనంతరం సెట్విన్ (SETWIN) ఆధ్వర్యంలో స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.
మంగళవారం కలెక్టర్ నల్లగొండ పట్టణ పరిసరంలోని రాంనగర్ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలలో నిర్వహించిన వృత్తి విద్యపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మారుతున్న సాంకేతికత నేపథ్యంలో విద్యార్థులు చదువుతో పాటు వృత్తి కోర్సుల్లో శిక్షణ పొందితే భవిష్యత్తులో పోటీ పరీక్షలు, ఉద్యోగావకాశాల్లో పెద్ద ప్రయోజనం ఉంటుందని ఆమె అన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాలలో కూడా నూతన సాంకేతికతల వల్ల మార్పులు వస్తున్నాయని వివరించారు.
జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, జూనియర్ కళాశాలల్లో ఇంటర్, 9, 10 తరగతి విద్యార్థులకు బ్యాచ్‌లవారీగా సెట్విన్ ద్వారా వృత్తి శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సెట్విన్ ద్వారా అందించే కోర్సుల్లో వెబ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిఫికేషన్, ఎడ్యుకేషనల్, టెక్నికల్ వంటి అనేక కోర్సులు ఉన్నాయని చెప్పారు. తమ అభ్యర్థన మేరకు సెట్విన్ మొత్తం ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వనుందని, మిగిలిన 50 శాతం ఫీజును కూడా చెల్లించలేని నిరుపేద విద్యార్థులకు జిల్లా యంత్రాంగం తరఫున ఫీజు చెల్లిస్తామని తెలిపారు.
సెట్విన్ కోర్సులు వారంలో నాలుగు రోజులపాటు, రెండు నెలల నుంచి ఆరు నెలలపాటు కొనసాగుతాయని, పాఠశాల సమయాలు పూర్తయ్యిన తర్వాత ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సును ఎంచుకుని శిక్షణ పొందవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు క్యారియర్ గైడెన్స్, సెట్విన్ కోర్సుల ప్రయోజనాలు వివరించారు. విద్యార్థులు జీవితంలో పెద్ద లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి సాధనకు కృషి చేయాలని, క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.
ఇటీవల మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, దేశ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ విజయం, బాక్సర్ నిఖత్ జరీన్ విజయాలను గుర్తు చేస్తూ విద్యార్థినులు కూడా తమ లక్ష్య సాధనకు కృషి చేయాలని ప్రేరేపించారు.
చిన్న వృత్తులు, ఉద్యోగాల ద్వారానే భవిష్యత్తులో ఉన్నత స్థానాలను పొందవచ్చని కలెక్టర్ అన్నారు.
ఇంటర్మీడియట్, 9వ, 10వ తరగతుల వార్షిక పరీక్షల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే విద్యార్థులకు దేశంలోని వారు కోరుకున్న ప్రదేశానికి విమాన ప్రయాణం, రెండు రోజుల ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామని, అటువంటి ప్రతిభావంతుల విద్యార్థులను తీర్చిదిద్దిన టీచర్లకూ ఇదే సౌకర్యం అందజేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ వై. అశోక్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి విజయేందర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, డీఈఓ బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్, గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, సెట్విన్ ప్రతినిధి రేణుక, ప్రిన్సిపాల్ కుబ్రా, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments