డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం కృషిచేసిన మహానీయుడని కొనియాడారు. అణగారిన వర్గాల ఆశాకిరణంగా నిలిచి, స్వాతంత్ర సమరంలో పాల్గొని దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. కార్మిక, రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. 22 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు.
విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని సూచించారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్, దళిత సంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అంతకుముందు మర్రిగూడ బైపాస్ మరియు ఎన్‌జీ కళాశాల వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments