కలెక్టర్ హామీ ఇచ్చినా అమలు కాని వైనం.. అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆవేదన
చీకటి వెలుగునల్లగొండ,
నల్గొండ నియోజకవర్గంలోని డి-40 కాలువ కింద సాగు చేస్తున్న రైతులకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించిన రైతులకు రెండు రోజుల్లో డి-40 కాలువకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు నీరు విడుదల చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డి-37, డి-39, డి-25 కాలువలకు నీరు అందుతున్నప్పటికీ డి-40 కాలువకు మాత్రం నీటిని విడుదల చేయకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు కోసం నీటిని విడుదల చేయాలని పలుమార్లు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. అధికారులను కలిసిన ప్రతిసారీ ‘రేపు.. మాపు’ అంటూ కాలయాపన చేస్తున్నారని ఈ ఆరోపించారు.
నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్, కార్యనిర్వహణ ఇంజినీర్, ఉప కార్యనిర్వహణ ఇంజినీర్లను పలుమార్లు కలిసి సమస్యను వివరించినా స్పందన కనిపించలేదని రైతులు పేర్కొన్నారు. ఇప్పటికే సాగు పనులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో డి-40 కాలువకు తక్షణమే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ ఇచ్చిన హామీని అధికారులు వెంటనే అమలు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. 24 గంటల్లోగా డి-40 కాలువకు నీటిని విడుదల చేయకపోతే కార్యాచరణ ప్రకటించి, రైతులందరినీ సమీకరించి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకుడు కందుల లక్ష్మయ్యతో పాటు గుండెబోయిన నాగరాజు, గోవర్ధన్, ప్రవీణ్, శేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కార్తీక్, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments