తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల కొనుగోలుపై 10-20 శాతం వరకు డిస్కౌంట్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సెక్రటేరియట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఈవీ కంపెనీలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు అందించేందుకు ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు.
తెలంగాణ ఈవీ పాలసీ కింద రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్‌పై 100% మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 1,15,551 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదు కాగా, సుమారు రూ.925.94 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం వదులుకున్నప్పటికీ పర్యావరణ రక్షణకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా వంటి సంస్థలు ఈ డిస్కౌంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తే, వారు ఈవీ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తారని మంత్రి అన్నారు.
ఇక రాష్ట్రంలో ఈవీ వాహనాల వినియోగం 0.60% నుంచి 1.50% వరకు పెరిగినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ప్రభుత్వ వాహనాలు కూడా ఈవీ ఆధారంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి, సుస్థిర రవాణాను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు పేర్కొన్నారు. నగర కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ పాలసీ కీలక పాత్ర పోషిస్తుందని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments