పవిత్ర రంజాన్ పర్వదినాన్ని సోదరభావంతో, మతసామరస్యంతో జరుపుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముస్లిం మైనార్టీల కోసం దావత్-ఏ-ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బుధవారం నల్గొండలోని స్టార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మైనార్టీలకు అందించే సంక్షేమ చర్యలపై వివరించారు.
రంజాన్ సందర్భంగా పేద మైనార్టీ కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు (తోఫా) పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాకు మొత్తం 5,250 ప్యాకెట్లు కేటాయించగా, నల్గొండ నియోజకవర్గానికి 1,250 ప్యాకెట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఇవి ఆర్థిక, సామాజిక పురోగతికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. రంజాన్ పండుగను శాంతియుతంగా, ఐక్యతతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆఫీజ్ ఖాన్, డీఎస్పీ శివరాం రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, తహసిల్దార్ పరశురాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments