తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ అక్కెనపల్లి మీనయ్య పేర్కొన్నారు. ఆమె 4వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం మనవడు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యవతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో సూర్యాపేట జిల్లాకు చెందిన నిరుపేద జుట్టుకొండ వీరయ్యకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.
ముందుగా మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీనయ్య మాట్లాడుతూ స్వరాజ్యం జీవితం త్యాగాలకు ప్రతీక అని, ఆమె పేదల కోసం చేసిన సేవలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం మహిళా హక్కులు, పేదల హక్కుల కోసం చివరి వరకు పోరాడిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. ఆమె స్ఫూర్తితో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేపడతామని చెప్పారు.
సత్యవతి హాస్పిటల్ ఎండీ డాక్టర్ రాంమనోహర్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం గర్వకారణమన్నారు. తమ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పీ. నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రతినెల మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, మహిళలకు టైలరింగ్, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సామాజిక సేవలో కృషి చేస్తున్న అనిత, షేక్ సుల్తానాలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, డాక్టర్ సంపద, సత్యనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments