ePaper
Friday, March 13, 2026

గ్రామాభివృద్ధిపై సర్పంచులు దృష్టి సారించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ: గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి Komatireddy Venkat Reddy అన్నారు.

గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్స్‌లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాలలో సర్పంచులు గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. గ్రామ పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆపదలో ఉన్న వారిని గుర్తించి ఆదుకోవడం ద్వారా సర్పంచుల గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రెండువందల కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా సమగ్ర నివాస పాఠశాలలు నిర్మిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఆ పాఠశాలను డిసెంబర్ 9న ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పాఠశాలలో అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదివే అవకాశం ఉంటుందని వివరించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు వస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాలలో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళితే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గ్రామపంచాయతీ సమావేశాలు నిర్వహించి గ్రామాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం కూడా మాట్లాడారు. అనంతరం సర్పంచుల పాత్ర, బాధ్యతలు మరియు వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖల అధికారులు చిత్రప్రదర్శన ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జెడ్పీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!