వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక రవీంద్ర నగర్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో గాయత్రి యజ్ఞం, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి శాస్త్రోక్తంగా సరస్వతీ అమ్మవారి పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీమతి సుధారాణి మాట్లాడుతూ— విద్య అన్నది అన్ని చోట్ల బోధిస్తారుగానీ, శిశు మందిర్‌లలో విద్యతో పాటు సంస్కారం, విలువలు, అనుబంధాలు నేర్పుతారని, ఇవే భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు. సంస్కారం లేని విద్య భవిష్యత్తు లేని జీవితంగా మారుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇటువంటి విద్యాసంస్థలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్ నల్గొండ విభాగ్ ప్రచారక్ కాచం సత్యనారాయణ— ఈ తరహా పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులే దేశ భవిష్యత్తు అని పేర్కొన్నారు. పిల్లలకు హిందూ సంస్కృతి–సంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, పౌర విధులు, దేవాలయ పరిరక్షణ, దేశ రక్షణ వంటి పంచ పరివర్తన అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సమితి కమిటీ అధ్యక్షులు దోసపాటి శ్రీనివాస్, కార్యదర్శి చిలుకూరు పరమాత్మ, ప్రబంధక కమిటీ అధ్యక్షులు గోవిందు సుధాకర్, ప్రధాన కార్యదర్శి తిరందాసు లక్ష్మీనారాయణ, కోశాధికారి నేలపట్ల రవికుమార్, అలాగే కొండ నవీన్, సరిత, మహేశ్వరి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం అమ్మవారి కుంకుమ, పండ్లను ప్రసాదంగా పంపిణీ చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments