పట్టణాభివృద్ధికి ఇప్పటికే ₹2000 కోట్లు – అవసరమైతే మరో ₹2000 కోట్లు తెస్తాం
నల్గొండ, జనవరి 17:
నల్గొండ మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా మారిన నేపథ్యంలో పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ పట్టణ అభివృద్ధికి ఇప్పటివరకు సుమారు రూ.2000 కోట్లు ఖర్చు చేసినట్లు, అవసరమైతే మరో రూ.2000 కోట్లు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

శనివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.18.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
అమృత్–2 పథకం కింద రూ.216 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నూతన ఎస్‌టీపీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రూ.56.75 కోట్లతో 12 కొత్త నీటి ట్యాంకులు, తాగునీటి పైపులైన్‌ల నిర్మాణం ద్వారా మంచినీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.
టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో రూ.53 కోట్లకు అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పనులు, ఎస్‌డీఎఫ్ నిధులతో రూ.109 కోట్ల వరద కాలువలు, స్మశానవాటికల అభివృద్ధి, అంతర్గత రహదారుల పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
బస్టాండ్ నుంచి మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియం వరకు రూ.14 కోట్లతో బీటీ రోడ్డులు, డీఈఓ కార్యాలయం నుంచి మిర్యాలగూడ రోడ్డు వరకు రూ.18 కోట్లతో రోడ్డు పనులు చేపట్టామని తెలిపారు.
రూ.545 కోట్లతో బైపాస్ రోడ్డు, పానగల్ చాయ సోమేశ్వర దేవాలయం నుంచి ఎస్‌ఎల్‌బీసీ కాలనీ వరకు రూ.565 కోట్లతో రోడ్లు, డ్రైన్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.
ఆర్ అండ్ బి నిధులతో రూ.260 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ మెడికల్ కాలేజ్ నుంచి అద్దంకి రోడ్డు వరకు రహదారి నిర్మాణం, పట్టణంలో ఐదు విద్యుత్ సబ్ స్టేషన్ల మంజూరు, అందులో నాలుగు సబ్ స్టేషన్లకు ఇప్పటికే శంకుస్థాపనలు చేసినట్లు మంత్రి తెలిపారు.
నల్గొండ–మునుగోడు, ధర్వేశిపురం, ముష్రంపల్లి రోడ్లను డబుల్ రోడ్డులుగా రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తుండగా, పనులు 70 శాతం పూర్తయ్యాయని చెప్పారు. నల్గొండ నుంచి గుండపల్లి–కురంపల్లి వరకు రూ.60 కోట్ల రోడ్డు పనులు కూడా 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
రూ.25 కోట్ల నాక్ బిల్డింగ్ 90 శాతం పూర్తయిందని, రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన చేశామని, ఏడాది కాలంలోనే క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభించామని వెల్లడించారు.
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.250 కోట్లతో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొత్త భవనాలు, బీ ఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ వంటి కొత్త కోర్సులు ప్రారంభించినట్లు తెలిపారు.
24 గంటల కృష్ణానీటి సరఫరా కోసం రూ.125 కోట్ల డీపీఆర్‌ను ప్రభుత్వానికి పంపామని, లతీఫ్ సబ్ దర్గా, బ్రహ్మంగారి గుట్టకు రూ.140 కోట్లతో ఘాట్ రోడ్ పనులు కొనసాగుతున్నాయని, మార్చిలోగా పూర్తవుతాయని తెలిపారు.
ఎన్‌సీఏపీ నిధులతో పార్కులు, మీడియన్ల అభివృద్ధి, ఎన్‌హెచ్‌ఎం నిధులతో ఫుడ్ స్ట్రీట్, మున్సిపల్ సాధారణ నిధులతో రూ.55 కోట్ల పనులు చేపట్టామని వివరించారు.
నల్గొండ కార్పొరేషన్‌గా మారినందున కేంద్రం నుంచి నేరుగా నిధులు వచ్చే అవకాశం ఉందని, పట్టణ ప్రజల సహకారంతో నల్గొండను హైదరాబాద్‌కు సమాంతరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments