హైదరాబాద్:
ఎన్టీవీ మీడియాలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనానికి సంబంధించి ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను ఎటువంటి విచారణ లేకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గోషామహల్ నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.ఎస్. సుభాష్ కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జల వీరేష్ తెలిపారు.
జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్లను బాధ్యులను చేస్తూ, సిట్ పోలీసులు అర్ధరాత్రి సమయంలో వారి నివాసాల్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ అరెస్టు చేయడం దారుణమని వారు విమర్శించారు. మీడియా సంస్థల్లో ప్రసారమయ్యే కథనాలకు ఆయా సంస్థల ఎడిటర్లు, యాజమాన్యం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, సంస్థలో పని చేసే జర్నలిస్టులను మాత్రమే బాధ్యులను చేసి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో సేవలందిస్తున్న జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని వారు ఆరోపించారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడే ఈ జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో కూడా ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు.
బహుజన వర్గాలకు చెందిన అనేక మంది జర్నలిస్టులు సరైన వేతనాలు లేకపోయినా వృత్తి పట్ల నిబద్ధతతో పని చేస్తున్నారని, అలాంటి వారిపై అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారతాయని అన్నారు. ముగ్గురు జర్నలిస్టులను వెంటనే విడుదల చేసి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments