పానగల్లు గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ టూ టౌన్ ఎస్‌ఐ వై. సైదులు గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ సైదులు గారు మాట్లాడుతూ, స్వామి వివేకానంద యువతకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, దేశభక్తిని బోధించిన మహానీయుడని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో జీవిస్తూ సమాజానికి ఉపయోగపడే మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. అలాగే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్య వక్తగా పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ నల్గొండ జిల్లా ప్రచారక్ ఋషి వర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో అనేక మహానీయులు యువతకు మార్గదర్శకులుగా నిలిచారని తెలిపారు. స్వామి వివేకానంద, ఆయన గురువైన రామకృష్ణ పరమహంస, సమాజ సంస్కరణ కోసం పోరాడిన దయానంద సరస్వతి, దేశ స్వాభిమానం కోసం జీవితాన్ని అర్పించిన మహారాణా ప్రతాప్, హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి మహానీయుల జీవితాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సేవ, త్యాగం, క్రమశిక్షణ, దేశభక్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు గారు మాట్లాడుతూ, స్వామి వివేకానంద చూపిన మార్గం నేటి యువతకు అత్యంత అవసరమని అన్నారు. యువత చదువు, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగితే దేశ భవిష్యత్తు బలపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం నిరంతర కృషితో పాటు, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. యువతే దేశానికి అసలైన శక్తి అని, వారి ఆలోచనలు, ఆచరణలు సమాజ దిశను మార్చగలవని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అన్నపూర్ణ సేవా సమితి సభ్యులైన నారాయణదాసు శ్రీహరి గారి కుమారుడు అభి గారి సహకారంతో 50 మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన అభి గారికి వక్తలు కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా ఇటీవల కానిస్టేబుల్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అన్నపూర్ణ సేవా సమితి సభ్యుడు కొండ నరేష్ గారిని టూ టౌన్ ఎస్‌ఐ సైదులు గారు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్ గారు చేసిన సేవలను వక్తలు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటీవల దేశ ప్రధానమంత్రి లీగల్ సర్వీసెస్ కార్యక్రమాల సందర్భంగా న్యూఢిల్లీ సుప్రీంకోర్టులో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని సమాజ సేవ రంగంలో తన వంతు పాత్ర పోషించినందుకు, గౌరీ పురస్కార్ అవార్డు గ్రహీత అయిన శ్రీకాంత్ గారి సేవలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు మల్లబోయిన రాజు, మిరియాల గిరి, పగిళ్ల రాము, ఎల్లంల శివరాం, ఆగు యాదగిరి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments