నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, ఫుట్ పాత్ లపై పడుకునేవారు చలి తీవ్రతకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉన్న నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.
.
సోమవారం ఉదయం 5 గంటలకే ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిరాశ్రయులకు ఏర్పాటు చేసిన వసతి , డార్మెటరీలు,
మంచాలు, దుప్పట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. అంతేకాక నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఉన్న వారితో మాట్లాడి సౌకర్యాల పై ఆరా తీశారు.
నల్గొండ పట్టణంలో అనేకమంది నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, ఫుట్ పాత్ పై పడుకునేవారు ఉన్నారని, ప్రస్తుతం చలికాలం కారణంగా చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వీరందరూ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని,ఇందుకు గాను అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి ని, మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. గడిచిన రెండు, మూడేళ్ల నుండి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నిరాశ్రయుల వసతి గృహన్ని నిర్వహించడం జరుగుతున్నదని, దీన్ని వినియోగించుకునాలనుకునేవారు ఆధార్ కార్డు,చిరునామా ,ఫోన్ నంబర్ సమర్పిస్తే చేయాలన్నారు. ప్రస్తుతం నిరాశ్రయుల వసతి కేంద్రంలో 17 మంది ఉన్నారని, 60 మందికి వసతి కల్పించేందుకు ఇక్కడ అవకాశం ఉందని, మహిళలు, పురుషులకు వేరువేరుగా డార్మెటరీలతో పాటు, టాయిలెట్ సౌకర్యం ఉన్నాయని తెలిపారు. ఎలాంటి ఆధారం లేని వారు, ఆశ్రయం లేనివారు, వివిధ కారణాలవల్ల ఇంటి నుండి బయటకు వచ్చిన నిరాశ్రయులు ఈ నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఉండవచ్చని, జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఉన్న నిరాశ్రయుల వసతి కేంద్రం పూర్తి భద్రతతో ఉందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన వారి సహాయకులు, అత్యవసర చికిత్సల కు వచ్చిన వారి సహాయకులు ఈ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నిరాశ్రయుల వసతి గృహంలో ఉన్న వారికి వివిధ ఎన్జీవోలు భోజన సదుపాయాలు కల్పిస్తున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పట్టణంలో ఫుట్ పాత్ లపై, జంక్షన్ ల వద్ద, రాత్రిపూట నిద్రించే వారిని గుర్తించి సర్వే నిర్వహించి అందరిని వసతి కేంద్రానికి తీసుకువచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిరాశ్రయుల వసతి గృహంలో ఉండే వారు ఎవరైనా జ్వరము, ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వైద్య చికిత్స అందించాలని జి జి హెచ్ డిప్యూటీ ఆర్ ఎం ఓ డాక్టర్ నగేష్ ను ఆదేశించారు. డాక్టర్లు వారానికి ఒకసారి వసతి కేంద్రాన్ని సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో నిరాశ్రయుల వసతి గృహానికి సంబంధించి ఫ్లెక్సీ, బోర్డ్ ఏర్పాటు చేసి అందరూ వినియోగించుకునేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. నిరాశ్రయుల వసతి గృహంలో ఎవరైనా సీనియర్ సిటిజన్లు ఉన్నట్లయితే వారిని గుర్తించి వారికి పెన్షన్ తో పాటు, ఇతర సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు. అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇంటిని ఇచ్చేందుకు గుర్తించాలని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రి ఆవరణలో ఉన్న యేసు అనే కుష్టి రోగితో మాట్లాదగా తనకు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ కావాలని కోరగా మంజూరు చేశారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెత్త,మూళ్ళ పొదలు తొలగించాలని, ఓపెన్ మాన్యువల్స్ వెంటనే మూసివేయాలని, వారం రోజుల్లో పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాజువాలిటీ తో పాటు, ఆసుపత్రికి క్యాంటీన్ ,నిర్మాణంలో ఉన్న పీజీ హాస్టల్ ను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, స్టోర్ రూమ్ కు ఉపయోగిస్తున్న గదులు సద్వినియోగం చేసుకోవాలని,మున్సిపల్ వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్జీ కళాశాల వద్ద ఉన్న వీధి వ్యాపారుల షెలెటర్లలో రెండింటిలో ర్యాకులు ఏర్పాటు చేసి వినియోగించని దుస్తులు, చెప్పులు,బూట్ల వంటివి అవసరమైన వారు వినియోగించుకునేందుకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆర్డీవో తో పాటు, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఎవరైనా వినియోగించని దుస్తులు అలాగే దాతల ద్వారా సమర్పించే దుస్తులను ఏర్పాటు చేయాలని, అవి అవసరం ఉన్నవారు తీసుకునే విధంగా వారి ఫోన్ నెంబర్, ఆధార్ ఆధారంగా వారికి ఇచ్చే విధంగా చూడాలని చెప్పారు. ఆర్డీవో వై. అశోక్ రెడ్డి తో పాటు ,మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, జిజిహెచ్ డిప్యూటీ ఆర్ ఎం ఓ డాక్టర్ నగేష్, తహసిల్దార్ పరశురాం, తదితరులు ఉన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments