కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని, అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదవి ఉన్నా లేకున్నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవ చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయించడం తన బాధ్యతగా తీసుకుంటానని అన్నారు.
నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పేదలకు రేషన్ కార్డులు, ఇళ్లు ఇవ్వలేదని, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్నారని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడటం మానుకుని, ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ప్రజాధనం దోచుకున్న అంశాలపై లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్రను గుర్తు చేస్తూ, జవహర్ లాల్ నెహ్రూ దేశానికి భారీ ప్రాజెక్టులు అందించారని, ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయీకరించి పేదల సంక్షేమానికి బాటలు వేసారని తెలిపారు. రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి నాంది పలికారని చెప్పారు. సోనియా గాంధీ త్యాగాలకు ప్రతీక అని, దేశ పేదల కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, యువతతో నల్గొండ పట్టణం కాంగ్రెస్ జెండాలతో కిక్కిరిసింది. యువ చైతన్య ర్యాలీ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments