నల్గొండ జిల్లాలో అర్హత ఉన్న దివ్యాంగులందరికీ దశలవారీగా బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
బుధవారం ఈసీఐఎల్ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సమీపంలోని టీటీడీసీలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ మోటార్ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ప్రజావాణి తదితర సందర్భాల్లో అనేక మంది దివ్యాంగులు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు కావాలని విజ్ఞప్తి చేయగా, ఈసీఐఎల్ యాజమాన్యంతో చర్చించి మొదటి విడతలో జిల్లాలోని 105 మంది దివ్యాంగులకు ఇవి అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం 50 మందికి ట్రైసైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. దివ్యాంగులు ఈ సైకిళ్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ముందుకు సాగాలని ఆమె కోరారు.
తాను జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లావ్యాప్తంగా దివ్యాంగుల సర్వే నిర్వహించామని, సుమారు 55 వేల మంది దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వారిలో అనేక మందికి వివిధ రకాల దివ్యాంగ పరికరాలు అవసరమని పేర్కొన్నారు. తొలి దశలో సుమారు రూ.70–80 లక్షల విలువైన బ్యాటరీ మోటార్ ట్రైసైకిళ్లు అందజేస్తున్నామని, ఇందుకు ఈసీఐఎల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మారుమూల గిరిజన ప్రాంతాల్లో బాలికల టాయిలెట్లు, రక్తహీనత నివారణ, పౌష్టికాహారం వంటి అంశాల్లో కూడా ఈసీఐఎల్ సహకారం అందించాలని కోరారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాల అవసరంపై సర్వే కొనసాగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత అలింకో, ఈసీఐఎల్‌కు సమర్పిస్తామని తెలిపారు.
ఈసీఐఎల్ సీఎండీ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ, నల్గొండ వంటి పెద్ద జిల్లాలో దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్లు అందించడం ఆనందంగా ఉందన్నారు. తమ సంస్థ చంద్రయాన్, న్యూక్లియర్ పవర్ వంటి కీలక రంగాల్లో సేవలందిస్తూనే, సీఎస్ఆర్ నిధుల ద్వారా సామాజిక కార్యక్రమాలకు సహకరిస్తోందని చెప్పారు. జిల్లా కలెక్టర్ చర్యల మేరకే ఈ సహాయం అందించామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రామస్వామి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కృష్ణ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుబాబు, అలింకో డీజీఎం సందేశ్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఈసీఐఎల్ సీఎండీ అనురాగ్ కుమార్ దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments