ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ గారి సూచనలతో నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ నల్ల రిబ్బన్ ధరించి మహాత్మా గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నల్గొండలోని క్లాక్ టవర్ నుండి రామగిరిలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీగా ఈ కార్యక్రమం కొనసాగి విజయవంతంగా ముగిసింది.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌గా, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఉపాధి లేక వలస వెళ్తున్న అణగారిన వర్గాలకు ధైర్యం నింపేందుకు రెండు వేల ఐదులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం తీసుకువచ్చారని తెలిపారు. గత ఇరవై సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ వర్గాలకు ఈ చట్టం ఎంతో మేలు చేకూర్చిందని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలను కాపాడిన గొప్ప ఉపాధి చట్టమని పేర్కొన్నారు.
దేశ సంపదను అంబానీ అదానీలకు కట్టబెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కక్ష గట్టి, దేశంలో కాంగ్రెస్ నేతల పేర్లు తొలగించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నూట నలభై కోట్ల మంది హృదయాల్లో మహాత్మా గాంధీ జాతిపితగా నిలిచారని, గాడ్సేను పూజించే బీజేపీ గాంధీ సిద్ధాంతాలను వ్యతిరేకించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రపంచంలోని అనేక దేశాలు గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తుంటే, బీజేపీ మాత్రం వాటిని వ్యతిరేకిస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి సునీత, జిల్లా సీనియర్ నాయకులు కన్నా రావు, సుధాకర్ పోకల, దేవదాస్, ఎండీ ముంతాజ్ అలీ, శివ, గౌతమ్, కిరణ్, వెంకటేశ్వర్లు, ఇంటక్ చైర్మన్ అంబటి సోమన్న, ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి, పుట్ట వెంకన్న, రాజేందర్ రెడ్డి, సేవాదళ్ చైర్మన్ మేకల సాగర్ రెడ్డి, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments