నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని సంకల్పించిందని తెలిపారు. ఇందులో భాగంగానే పైలెట్ పద్ధతిలో ముందుగా నల్గొండ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల చేత రైస్ మిల్లులను ఏర్పాటు చేయిస్తామని వెల్లడించారు. జిల్లాలో రైస్ మిల్లుల కొరతను దృష్టిలో ఉంచుకొని, మహిళలే మిల్లులను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వమే రుణాలు మంజూరు చేసి, ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో రైస్ మిల్లులు నిర్మించనున్నట్లు తెలిపారు.

తక్షణమే రైస్ మిల్లుల కోసం స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వచ్చే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రైస్ మిల్లులను ఏర్పాటు చేసే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఉచిత బస్సు సౌకర్యం, బస్సుల నిర్వహణ, పెట్రోల్ పంపులు, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ వంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. నల్గొండ ఎస్ఎల్బీసీ వద్ద కేటాయించిన పెట్రోల్ పంపు ద్వారా ప్రతినెల సుమారు పది లక్షల రూపాయల ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.
తమ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధానంతో పనిచేస్తుందని, చీరల డిజైన్ విషయంలో ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం ఏడాది పాటు ఆలోచించి మంచి నాణ్యమైన చీరలను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి చీరల పంపిణీ లక్ష్యంగా ఉంచగా, ఇప్పటివరకు 65 లక్షల చీరలు చేరాయని, మిగిలినవి రాగానే పట్టణ ప్రాంత మహిళలకు పంపిణీ చేస్తామని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో సుమారు 150 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, నల్గొండ జిజిహెచ్ మరియు మెడికల్ కళాశాలలను అభివృద్ధి చేశామని చెప్పారు. జిజిహెచ్‌లో ప్రతినెల 800 డెలివరీలతో పాటు అత్యాధునిక శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచామని తెలిపారు. మహిళలు నైపుణ్యాభివృద్ధి కోసం న్యాక్ ద్వారా భవనం నిర్మాణం జరుగుతుందని, త్వరలో పనులు పూర్తవుతాయని చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మహిళలకు అతిపెద్దపీట వేస్తోందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 4,24,000 ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ చీర అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళా సంఘాలు ఆర్థిక అంశాలతో పాటు సామాజిక అంశాలను కూడా తమ సమావేశాల్లో చర్చించాలని, కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే ప్రభుత్వ సహకారం అందిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ హఫీజ్ ఖాన్, డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రూ.2.20 కోట్ల విలువచేసే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments