నల్గొండలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కవితపై తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్ రావును విమర్శించే అర్హత కవితకు లేదని ఆయన మండిపడ్డారు.
హరీశ్ రావు 2001 నుండి నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడని, ఎన్నో కష్టాలు, అటుపోట్లు ఎదుర్కొంటూ ప్రజల కోసం పోరాడిన నాయకుడు అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. హరీశ్ రావు వ్యక్తిత్వంపై కవితకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
ఉద్యమం జరుగుతున్నప్పుడే హరీశ్ రావు ముందుండి పోరాడితే, కవిత మాత్రం విదేశాల్లో ఉన్నారని ఆయన విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మంచివారిగా, బీఆర్ఎస్ నేతలు చెడువారిగా చూపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. “ఎవరి చేతిలో కీలు బొమ్మ అయ్యావో ప్రజలందరికీ అర్థమే” అన్నారు.
హరీశ్ రావు, కేసీఆర్ కుటుంబంపై కవిత చేస్తున్న వ్యాఖ్యలు నిరాధారమని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇకపై ఆమె ఆరోపణలకు ప్రతిచోటా సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
కవిత వ్యవహారం హరీశ్ రావును ఒంటరి చేయాలన్న కుట్రలో భాగమని, ఆయనపై అవినీతి మచ్చ వేసి బీఆర్ఎస్ను బలహీనపరచాలన్న కాంగ్రెస్ ఎజెండాకు తోడ్పాటుగా ఉందని ఆయన ఆరోపించారు. “ఆమె ప్రవర్తనతో కేసీఆర్ గారి ఆత్మ క్షోభిస్తోంది” అని వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ‘అడ్డదారిలో’ గెలిచినట్టు ఆరోపిస్తూ, ఉద్యమకారులు ఇందుకు అధైర్యపడొద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మాయలో పడితే నష్టపోయేది కవితే అవుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, మైనం శ్రీనివాస్, దోటి శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, యుగంధర్ రెడ్డి, బొజ్జ వెంకన్న, గుండెబోయిన జంగయ్య, సందీప్ రెడ్డి, గంజి రాజేందర్, భీపంగి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments