
నల్గొండ:
నల్గొండ జిల్లా బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘కోమటి రెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల’ అని నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాత శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చి, సుమారు ₹8 కోట్ల వ్యయంతో కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించబడింది.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ—
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం తన ప్రధాన ధ్యేయం అని తెలిపారు. బొట్టుగూడ పాఠశాలలో త్వరలోనే డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ విద్య, తెలుగు-ఇంగ్లీష్-ఉర్దూ మీడియం బోధనతో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు అందించనున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్ ప్రణాళికగా, రాబోయే మూడేళ్లలో నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను మోడల్ సంస్థలుగా తీర్చిదిద్దుతామని మంత్రి ప్రకటించారు.
అలాగే, నల్గొండలో ఇప్పటికే ₹10 కోట్ల విలువ గల కోమటి రెడ్డి ప్రతీక్ జూనియర్ కళాశాల నిర్మాణం పూర్తయ్యిందని, తిప్పర్తి మరియు కనగల్ జూనియర్ కాలేజీలను కూడా మోడల్ కాలేజీలుగా అభివృద్ధి చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
విద్య, వైద్యం రంగాల్లో సేవలందించడమే తన సంకల్పమని గుర్తుచేసిన మంత్రి, ఇటీవల నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునాతన లాప్రోస్కోపీ యూనిట్ ప్రారంభం కూడా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జరిగిందని అన్నారు.
తన కుమారుడి పేరుతో ప్రభుత్వ పాఠశాల నామకరణం జరగడం పట్ల భావోద్వేగానికి లోనైన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా పాఠశాల ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments