నల్గొండ కల్చరల్, అక్టోబర్ 5 :

జిల్లా కేంద్రంలోని చారిత్రాత్మక హజ్రత్ సయ్యద్ లతీఫుల్లా షాఖాద్రీ దర్గా ఉరుసు వేడుకలు ఈ నెల 9వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
ఉరుసు వేడుకలు అధికారికంగా మూడు రోజుల పాటు జరుగుతాయి. అయితే ఉత్సవాలు మొత్తం నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. గుట్టమెట్ల ప్రాంతంలో ఇప్పటికే వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు అయ్యాయి. దర్గా పరిసర ప్రాంతం అంతా విద్యుత్ దీపాలతో, రంగుల అలంకరణలతో ఆధ్యాత్మిక, ఉత్సవ వాతావరణం నెలకొంది.
ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు స్థానిక మదీనా మసీదు వద్ద ప్రార్థనలతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం నగరంలో గొప్పగా చందన ప్రదర్శన (సాండల్ ప్రాసెషన్) నిర్వహించి రాత్రికి గుట్టమెట్లకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శత్రచంద్ర పవార్, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఉరుసు ఉత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తారని దర్గా పెద్దలు సయ్యద్ సమియుల్లా ఖాద్రీ, సల్మాన్ ఖాద్రీ తెలిపారు.
10వ తేదీన దర్గాలో దీపారాధన, భక్తులకు అన్నప్రసాదం, పాత కలెక్టరేట్ మసీదులో ఖురాన్ పారాయణం, ప్రముఖుల సందేశాలు జరుగుతాయి.
11వ తేదీన గుట్టమెట్ల వద్ద ప్రసిద్ధ కళాకారుల చేత క్వావ్వాలి కార్యక్రమం నిర్వహించనున్నారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ప్రకాశ సౌకర్యాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల రోజుల పాటు జరిగే ఉరుసు ఉత్సవాల్లో ముస్లింలు – హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈక్రమంలో దర్గా సమీపంలోని ఘాట్ రోడ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments