జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ:
నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ఆస్పత్రి పరిసరాలు లోపల, బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, డాక్టర్లు మరియు సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాతా–శిశు సంరక్షణ కేంద్రంలో ఓపీ, స్కానింగ్ విభాగాలు, వైద్యులు మరియు సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. వివిధ చికిత్సల కోసం ఆస్పత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్కానింగ్ సెంటర్‌ను పరిశీలించిన ఆయన, రోజుకు ఎంతమందికి స్కానింగ్ జరుగుతోందని, ఇన్‌పేషెంట్లు, ఔట్‌పేషెంట్ల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న దివ్యాంగుల ధ్రువపత్రాల జారీ కేంద్రం, రోగుల సహాయకులు వేచి ఉండే గదిని తనిఖీ చేశారు. వెయిటింగ్ హాల్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లను ప్రతిరోజూ శుభ్రపరచాలని, వెయిటింగ్ హాల్‌కు బోర్డు ఏర్పాటు చేయాలని శానిటేషన్ ఇన్‌చార్జిని ఆదేశించారు.
ధ్రువపత్రాల కోసం యూడీఐడీ కేంద్రానికి వచ్చిన నార్కెట్‌పల్లికి చెందిన సైదమ్మ, తుమ్మడం గ్రామానికి చెందిన నాగరాజులతో కలెక్టర్ మాట్లాడి, వారు ఎప్పుడు వచ్చారు, ఏ రోజుకు స్లాట్ ఇచ్చారనే వివరాలను తెలుసుకున్నారు. ఇప్పటివరకు 823 మందికి స్కానింగ్ నిర్వహించినట్లు యూడీఐడీ ఇన్‌చార్జి వివరించగా, పెండింగ్ కేసులు లేకుండా పనిని వేగవంతం చేసి పెండెన్సీ తగ్గించాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగుల ధ్రువపత్రాల జారీ ప్రక్రియపై డీఆర్‌డీఓ శేఖర్ రెడ్డి కలెక్టర్‌కు వివరించారు.
అనంతరం క్రిటికల్ కేర్ విభాగాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ స్కిన్, ఓపీ, ఫిజియోథెరపీ విభాగాలను తనిఖీ చేశారు. ఫిజియోథెరపీ చికిత్స కోసం వచ్చిన హుజూర్నగర్ సమీపంలోని కాల్వపల్లికి చెందిన నాగయ్యతో మాట్లాడిన కలెక్టర్, బీపీని క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలని, పక్షవాతం వంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మద్యపానం మానేసి పోషకాహారం తీసుకోవాలని సూచించారు.
తదుపరి ఆస్పత్రి క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఆయన, ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. రోగులు, డాక్టర్లకు అందిస్తున్న భోజనం నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు సమయానికి విధులకు హాజరుకాకపోవడాన్ని గమనించిన కలెక్టర్, ఆలస్యంగా వచ్చే సిబ్బందికి మేమోలు జారీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ నేత నరసింహారావును ఆదేశించారు. క్యాంటీన్ మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని సూపరింటెండెంట్ కలెక్టర్‌ను విన్నవించారు.
ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ నేత నరసింహారావు, డీఆర్‌డీఓ శేఖర్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్, డాక్టర్ స్వరూప, డాక్టర్ వందన తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments