నల్గొండ జిల్లా: త్రిపురారంలో ఉన్న తెలంగాణ గిరిజన బాలికల సంక్షేమ మినీ గురుకులం మరియు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
మొదటగా మినీ గురుకులాన్ని సందర్శించిన కలెక్టర్, సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో మాట్లాడుతూ వారి పేర్లు, వివరాలు, ఇష్టమైన సబ్జెక్టులు తదితర అంశాలను తెలుసుకున్నారు. విద్యార్థులను బాగా చదవాలని ప్రోత్సహిస్తూ, వారికి చాక్లెట్లు పంపిణీ చేశారు.
విద్యార్థులు తరగతి గదులలోనే రాత్రివేళలు నిద్రిస్తున్నారని తెలిసిన కలెక్టర్, తక్షణమే 100 పరుపులను నల్గొండ నుండి పంపిస్తానని ప్రకటించారు.
మినీ గురుకులంలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను ఆమె తనిఖీ చేసి, వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల ప్రాంగణం లోతుగా ఉందని, మట్టితో నింపాల్సిన అవసరముందని ప్రిన్సిపల్ భారతి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
తదుపరి కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, డాక్టర్లు మరియు సిబ్బందితో మాట్లాడారు. ఫార్మసీలో స్టాక్‌లో ఉన్న మందులు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, రిజిస్టర్లు, రిపోర్టులు తదితర వివరాలను పరిశీలించారు.
ఈ సందర్శనలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, మినీ గురుకులం ప్రిన్సిపల్ భారతి, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యులు, తహసీల్దార్ ప్రమీల, ఎంపీడీవో విజయలక్ష్మి తదితర అధికారులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments