నల్లగొండ, ఏప్రిల్ 6: నల్లగొండ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి మాఫియాకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు రూ.530 కోట్ల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నాసిరకం మట్టితో రోడ్డు నిర్మాణం జరుగుతుండగా, సంబంధిత అధికారులు, స్థానిక మంత్రి దీనిపై కనీసం స్పందించడం లేదని విమర్శించారు.
రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రమాణాలకు విరుద్ధంగా చెరువులు, కాలువలు, రిజర్వాయర్ల నుంచి మట్టిని తరలించి పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. దాదాపు రెండు లక్షల టిప్పర్ల మట్టి అక్రమంగా తరలించబడిందని, దీని విలువ రూ.140 కోట్లకు పైగా ఉంటుందని ఆరోపించారు.
కంచనపల్లి, దోమలపల్లి, పానగల్ ఉదయ సముద్రం, బుద్ధారం, అనంతారం, సాగర్ రోడ్ పరిసర ప్రాంతాల్లో చెరువులను లోతుగా తవ్వి పర్యావరణానికి నష్టం కలిగించారని అన్నారు. నిబంధనల ప్రకారం ఐదు ఫీట్ల వరకు మాత్రమే తవ్వకాలు చేయాల్సి ఉండగా, 40–50 ఫీట్ల వరకు తవ్వి చెరువులను దెబ్బతీశారని ఆరోపించారు.
ఈ చర్యల వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు, బోరు బావులు ఎండిపోవడం, రైతులకు నష్టం కలగడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అలాగే మత్స్యకారుల జీవనోపాధిపై కూడా ప్రభావం పడుతుందని తెలిపారు.
రోడ్డు నిర్మాణంలో నాణ్యతలేమి కారణంగా త్వరలోనే గుంతలు పడే ప్రమాదం ఉందని, ఇది వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. మట్టి దందాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువకులపై కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని, స్థానిక మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments