మహిళలు పురుషులతో సమానంగా ఎదిగి ఆర్థికంగా తమ సొంత కాళ్లపై నిలబడాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ శిక్షణ సంస్థలో కుట్టుమిషన్ల ద్వారా శిక్షణ పొందిన 116 మంది మహిళలకు కుట్టుమిషన్లు మరియు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఎవరూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక కోర్సులో శిక్షణ పొందాలని సూచించారు. పట్టుదలతో శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని తెలిపారు. నల్గొండలో ఏర్పాటు చేసిన సెట్విన్ శిక్షణ సంస్థను రాష్ట్రంలోనే నంబర్ వన్ సంస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
సెట్విన్ ద్వారా ఇప్పటివరకు 27 కోర్సుల్లో 1250 మందికి శిక్షణ అందించామని మంత్రి తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు సంఘాలుగా ఏర్పడితే వారికి ప్రభుత్వం ద్వారా రుణాలు అందిస్తామని చెప్పారు. అలాగే పాఠశాల విద్యార్థుల యూనిఫాం కుట్టే పనిని మహిళా సంఘాలకే అప్పగిస్తామని వెల్లడించారు.
కలెక్టరేట్ వద్ద న్యాక్ శిక్షణ సంస్థను కూడా ఏర్పాటు చేసి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో ఉందని, నూతన కలెక్టరేట్ కూడా నిర్మాణంలో ఉన్నదని చెప్పారు. ఇవి పూర్తయితే ఎలక్ట్రిషన్, ప్లంబర్ తదితర కోర్సులు నేర్చుకున్న వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసిన మహిళలను ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లుగా నియమిస్తామని మంత్రి తెలిపారు. మహిళలు చురుకుగా ఉండి కుటుంబ అభివృద్ధికి తోడ్పడాలని, పిల్లల విద్యాభివృద్ధికి మహిళలు, పురుషులు కలిసి పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి త్వరలో మూసి నది ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలిపారు. మూసి కాలుష్యం వల్ల నల్గొండ జిల్లాలో సుమారు 30 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని మొదటి దశలో 21 కిలోమీటర్లు, రెండవ దశలో మరో 21 కిలోమీటర్ల ప్రక్షాళనకు టెండర్లు పిలిచామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలు అడ్డుపడవద్దని కోరారు.
డిండి ప్రాజెక్టుపై మాట్లాడుతూ గతంలో ప్రకటించిన ప్రకారం టెండర్లు పిలిచి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మహిళలకు కుట్టుమిషన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేశారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments