పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక
భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.