బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలు, స్కాములు చేసిన చరిత్ర మీది - సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17:ప్రజల సొమ్మును దోచుకొని అవినీతి అక్రమాలకు పాల్పడిన డబ్బుతో ఫామ్‌హౌస్‌లు, హోటళ్లు, భూములు కొనుగోలు చేయడంతో పాటు భార్యలు, పిల్లల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. ప్రజా సమస్యలు, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు విమర్శించారు. ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
2014, 2015 సంవత్సరాల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు, నీటి లభ్యత తగ్గే పరిస్థితులు ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం రైతులకు సరైన అవగాహన కల్పించలేదని అన్నారు. దీంతో పంటలు సాగుచేసిన రైతులు నష్టపోయి ఆర్థికంగా కుంగిపోయారని, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. 2014లో 898 మంది, 2015లో 1,358 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించి ఉంటే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదని అన్నారు. ప్రస్తుతం మళ్లీ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా అవగాహన కల్పిస్తోందని తెలిపారు. నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆలోచించాలని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రైతులకు వివరిస్తున్నారని చెప్పారు. అయితే బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినప్పటికీ నాణ్యత లోపాల కారణంగా రైతులకు ఆశించిన ప్రయోజనం కలగలేదని విమర్శించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, ప్రాజెక్టు పనుల పునరుద్ధరణకు అవసరమైన నిధులు సమకూర్చి రైతులకు సాగునీరు అందించే దిశగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తూ, ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం తెలంగాణకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా ఉంటుందని అన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) పరిధిలో ఆర్థిక అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రభుత్వ ఆడిట్ నివేదికలో వెల్లడైందని సూర దేవరాజు తెలిపారు. 2014 నుంచి 2022 మధ్యకాలంలో రూ.94 కోట్ల మేర దుర్వినియోగం, మెటీరియల్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సెస్‌ను ఎన్పీడీసీఎల్లో విలీనం చేశారని చెప్పారు. గతంలో సెస్ పరిధిలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేసేవారని, ప్రస్తుతం ఎన్పీడీసీఎల్ పరిధిలో రైతులతో పాటు కొత్త ఇళ్లు నిర్మించుకునే వారికి తక్కువ ఖర్చుతో స్తంభాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో సిరిసిల్ల ప్రాంత రైతుల కోసం ఎన్ని 33 కేవీ సబ్స్టేషన్లు మంజూరు చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోకుండా, అధికారం కోల్పోయిన తర్వాత రైతుల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. రైతులు అమాయకులు కారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, మోసాల గురించి వారికి తెలుసని అన్నారు. రాజకీయ విమర్శలు మానుకొని సిరిసిల్ల ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కలిశారో వెల్లడించాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలే కారణమని ఆరోపించారు. సింగరేణి బొగ్గు గనుల్లో ఒకే అధికారిని తొమ్మిదేళ్ల పాటు కొనసాగిస్తూ బదిలీ చేయకుండా వేల కోట్ల రూపాయల కుంభకోణానికి అవకాశం కల్పించారని విమర్శించారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు ఆకునూరి బాలరాజు, సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నరేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు పత్తిపాక లక్ష్మీరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంగళ అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, నాయకులు బూర యాదగిరి, ఇప్పపూల లక్ష్మణ్, వంగరి అనిల్, గాజుల సాగర్, అలవాల సత్యనారాయణ, కొండ ప్రకాష్, సదుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.