🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 October 2026, 4:38 pm Posted by : CHEEKATI VELUGU

నల్గొండ గ్రామీణ రహదారులకు మహర్దశ.. రూ.74 కోట్లతో డబుల్‌ రోడ్లు

News Image
తేలకంటిగూడెం–ముషంపల్లి, ఎస్‌.లింగోటం–ముషంపల్లి రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌
నల్గొండ నియోజకవర్గంలో రహదారి సౌకర్యాల మెరుగుదలకు రూ.74 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రెండు డబుల్‌ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.కనగల్‌ మండలం తేలకంటిగూడెం, ఎస్‌.లింగోటం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
తేలకంటిగూడెం నుంచి తొరగల్లు, జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రూ.41 కోట్లతో, ఎస్‌.లింగోటం రోడ్డు నుంచి చెట్లచెన్నారం, చిన్నమాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రూ.33 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ రెండు రోడ్ల నిర్మాణంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు సులభతరమై, రహదారి అనుసంధానం మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు.రోడ్ల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో పాటు రైస్‌మిల్లులు, పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.30 వేల కోట్లతో పనులు చేపడుతున్నామని, నల్గొండ నియోజకవర్గంలోనూ గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు.
*ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు లబ్ధి*
ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని మంత్రి అన్నారు. తేలకంటిగూడెం గ్రామాన్ని ఇందిరమ్మ ఇళ్ల పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో 107 కుటుంబాలకు ఇళ్లు మంజూరయ్యాయని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.5.35 కోట్ల నిధులు కేటాయించినట్లు వివరించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.గ్రామంలోని ఇళ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు పట్టాలు అందించి గృహ నిర్మాణానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
*సన్నబియ్యం, ఉచిత విద్యుత్‌, మహిళా సంఘాలకు ప్రోత్సాహం*
రేషన్‌ కార్డుల పంపిణీ, సన్నబియ్యం సరఫరా, అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ వంటి సంక్షేమ కార్యక్రమాలను మంత్రి ప్రస్తావించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు.
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పెట్రోల్‌ బంకుల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల ద్వారా ఆదాయం పొందే అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల ద్వారా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.
*చెరువులు నింపేందుకు చర్యలు*
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగిస్తూ తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళా సముద్రం చెరువుతో పాటు పరిసర గ్రామాల్లోని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరద కాలువ ద్వారా నీటిని ఎత్తిపోసే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల కోసం రూ.20 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సంబంధిత అనుమతులు తీసుకొచ్చి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు.కరువు పరిస్థితుల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. రైతులు సాగు చేసుకున్న పంటలను కాపాడేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
*2028 జూన్‌ నాటికి శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేస్తాం*
నల్గొండ జిల్లా రైతులకు సాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శ్రీశైలం సొరంగ మార్గం పనులను వేగవంతం చేసి 2028 జూన్‌ నాటికి పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సొరంగ మార్గం పూర్తయితే రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ ప్రాజెక్టు పనుల కోసం ఇటీవల రూ.400 కోట్ల నిధులు విడుదల చేయించినట్లు పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించడంతో పాటు చెరువులు నింపి భూగర్భ జలాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
*బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు*
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు పండుగ చీరలు అందించే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ప్రజలు,రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండి పంటలు పండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో అశోక్ రెడ్డి, తహసిల్దార్ ఎం.పద్మ, ఎంపీడీవో ఏ.వేద రక్షిత,స్థానిక సర్పంచులు బైరు నాగమణి నాగయ్య, పోషమల్ల సురేష్, మళ్లీ కంటి సుజాత రాజు, రావుల మల్లేష్, గోగు గోవర్ధన్ రెడ్డి, మర్రి రాజేశ్వరి నరసింహ, నాగవెల్లి నాగమణి సైదులు,వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home