🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 October 2026, 3:33 pm Posted by : CHEEKATI VELUGU

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ కొలువులే లక్ష్యంగా ముందడుగు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని చేరాలి.. క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేయాలి: కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

News Image
REPORTER KUKUTLA VARUN
ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలను సాధించాలని జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ సూచించారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను బుధవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వారి సన్నద్ధత, శిక్షణ విధానం, బోధనకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ముందుగా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన కోసం నిరంతరం శ్రమించాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సూచించారు. పోలీస్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. శిక్షణలో బోధించే అంశాలను శ్రద్ధగా నేర్చుకోవడంతో పాటు ప్రతిరోజూ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకుని స్వయంగా చదువుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఉన్నప్పుడే పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించగలరని తెలిపారు.జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మాట్లాడుతూ పోలీస్‌ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకున్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో సుమారు 350 మంది అభ్యర్థులకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. రాత పరీక్షతో పాటు పోలీస్‌ ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో ఎదురయ్యే వివిధ దశలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను అన్ని విధాలా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.కేవలం శిక్షణ తరగతులకు హాజరవడంతోనే ఉద్యోగం సాధ్యం కాదని, తరగతులతో పాటు ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వయంగా చదవడం, గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం, మాక్‌ పరీక్షలు రాయడం, సమయపాలన పాటించడం ఎంతో కీలకమని ఎస్పీ సూచించారు. అర్థం కాని అంశాలపై శిక్షకులను సంప్రదించి వెంటనే సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. పరీక్షల్లో సమయ నిర్వహణ అత్యంత కీలకమని, అందువల్ల నిర్ణీత సమయంలో ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా నిరంతరం సాధన చేయాలని సూచించారు.ఉచితంగా లభిస్తున్న ఈ 45 రోజుల శిక్షణను అభ్యర్థులు ఎంతో విలువైన అవకాశంగా భావించాలని ఎస్పీ అన్నారు. ఉద్యోగం సాధించాలనే దృఢ సంకల్పంతో ప్రతి రోజును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లక్ష్య సాధనకు ఆటంకం కలిగించే అనవసర విషయాలకు దూరంగా ఉండాలని, మొబైల్‌ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని తెలిపారు. చదువుతో పాటు శారీరక దృఢత్వానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతిరోజూ పరుగు, వ్యాయామం వంటి శారీరక సాధనలో పాల్గొనాలని సూచించారు..అనంతరం కలెక్టర్‌, ఎస్పీ శిక్షణ తరగతులను పరిశీలించి అభ్యర్థులకు అందుతున్న బోధన, శిక్షణా విధానం, సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ పొందుతున్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని పోలీస్‌ శాఖలో కొలువు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్‌, డీటీసీ డీఎస్పీ నగేష్‌, ఎస్‌బీ సీఐ నాగరాజు, సీఐ కరుణాకర్‌, ఆర్‌ఐలు సంతోష్‌, హరిబాబు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది, సుమారు 350 మంది శిక్షణార్థులు పాల్గొన్నారు.
🏠 Home