🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 September 2026, 5:27 pm Posted by : CHEEKATI VELUGU

600 మందితో నల్లగొండలో ర్యాలీ.. డిమాండ్ల సాధనకు ఉద్యమబాటలో బ్యాంకు ఉద్యోగులు

News Image

చీకటి వెలుగునల్లగొండ,




బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందంటూ బ్యాంకు ఉద్యోగులు నల్లగొండలో కదంతొక్కారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు గురువారం పట్టణంలో భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 600 మంది ఉద్యోగులు తరలివచ్చి తమ డిమాండ్లపై గళమెత్తారు. క్లాక్‌టవర్ వద్ద ఉన్న ఎస్‌బీఐ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా సాగింది. ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఎస్‌బీఐ ప్రాంతీయ వ్యాపార కార్యాలయానికి చేరుకుని అక్కడ నిరసన చేపట్టారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, పనితీరు ఆధారిత ప్రోత్సాహక చెల్లింపుల్లో కొనసాగుతున్న వివక్షను తొలగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ సమానమైన, న్యాయమైన విధానాన్ని అమలు చేయాలని కోరారు. 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో ఇంకా పరిష్కారం కాని అంశాలను వెంటనే పరిష్కరించడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బ్యాంకు పెన్షనర్ల పింఛను నవీకరణను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఐదు రోజుల పని విధానం కోసం డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం అన్యాయమన్నారు. బ్యాంకింగ్ రంగ అభివృద్ధికి నిరంతరం సేవలందిస్తున్న ఉద్యోగుల మధ్య ప్రోత్సాహక చెల్లింపుల విషయంలో వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు. ఉద్యోగులందరికీ సమాన అవకాశాలు, న్యాయమైన విధానం కల్పించాలని డిమాండ్ చేశారు. వేతన ఒప్పందంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించడంలోనూ, పెన్షనర్ల పింఛను నవీకరణపై నిర్ణయం తీసుకోవడంలోనూ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల సమ్మె నిర్వహిస్తామని, అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎఐబీఈఏ నాయకులు కె. ఈశ్వర్, రాజశేఖర్, ఎన్‌సీబీఈ నాయకులు టి. సుమన్ కుమార్, ఎస్. నరసింహ, ఎఐబీఓసీ నాయకులు టి. శ్రామిక్‌తో పాటు ఎన్‌వీటీ, యాదయ్య, ప్రవీణ్, జీవన్, మాధవరెడ్డి, సింగం రాజు, సతీష్ రెడ్డి, యుగంధర్, ప్రియాంక, సిందూర, సాయి రాయి, మాధవి, సుగుణ్, మహిపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🏠 Home