పర్యావరణ పరిరక్షణపై అవగాహన సభ.. హరిత పాఠశాలలే లక్ష్యం: కలెక్టర్ సత్య శారద
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో “పర్యావరణ పరిరక్షణ – ప్లాస్టిక్ వాడకం నివారణ” అంశంపై అభినందన సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, స్లోగన్ రైటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్నతనం నుంచే పిల్లల్లో చెట్లు నాటడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, కాలుష్య ప్రభావాలపై అవగాహన కల్పించడం అవసరమని అన్నారు.
పాఠశాలలను హరిత పాఠశాలలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీవో ప్రతినిధులను శాలువాలతో సన్మానించారు.
ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యమైతేనే పచ్చని తెలంగాణ సాధ్యమవుతుందని కలెక్టర్ సత్య శారద తెలిపారు.
కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.